జీవితమంటేనే ఓ పోరాటం. ప్రతిమనిషీ…ఇంకా చెప్పాలంటే ప్రతిజీవి తమ మనుగడకోసం పోరాటం చెయ్యాల్సిందే.చేయలేనంటే చెల్లదు. సాకులు చెప్తే సాగదు. ముందుకు దూకాల్సిందే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందడుగు వెయ్యాల్సిందే..
ఈ పోరాటంలో నేను సైతం అంటూ ముందడుగు వేసాడు ఓ యువకుడు. అవిటితనం తనకు అడ్డుకాదంటూ ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చేపట్టాడు. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించాడు.
భుజంపై బ్యాగ్ పెట్టుకుని, గుండెల నిండా విశ్వాన్ని నింపి..చేతులనే కాళ్లుగా చేసి నడిచే ఈ యువకుడి పేరు పరశురాముడు. చిన్నతనంలో పరుశురాముడుకి జ్వరం వచ్చింది. దీంతో డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ కారణంగా ఒక కాలు పడిపోయింది.
మరో కాలు కాస్త బలంగా ఉన్నప్పటికీ జీవితాంతం అంగవైకల్యానికి గురయ్యాడు. 9వ తరగతి వరకు చదివిన పరశురాముడు ఆ తర్వాత ఇంట్లో పేదరికం కారణంగా బిచ్చగాడిగా మారాడు.
అయితే తాను ఒకరి ముందు చేయి చాచి అడుక్కోవడం అవమానంగా భావించాడు. దీంతో తాను కూడా కష్టపడి పనిచేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒకరి ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సెక్యూరిటీ గా చేస్తూనే ఖాళీ సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.
పరశురాం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ అవతారం ఎత్తేవాడు. ఇందుకోసం ప్రభుత్వ పథకంలో వచ్చిన ద్విచక్ర వాహనంతో స్విగ్గీ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేయడం ప్రారంభించాడు.
నేటి సమాజంలో శారీరకంగా ఫిట్‌గా ఉన్నా, చదువు , సదుపాయాలున్నా..ఇంకా తమకు ఏదో తక్కువ అయింది అనే నిరాశతో బతికేస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి నేటి యువతకు ఆదర్శం ఈ పరశురాముడు.