దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి తిరగబడతోంది. ఈ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా అందరూ భాగస్వాములు కావాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకతశిల్పంతో కరోనాపై అవగాహన కల్పించారు. ఒడిశాలోని పూరీ బీచ్లో సైకతశిల్పాన్ని రూపొందించి.. కరోనా పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కరోనా వ్యాక్సిన్లు వేసుకోవాలని.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని కోరారు.
టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,49,66,81,156 డోసుల టీకాలు పంపిణీ జరిగింది. గురువారం ఒక్కరోజే 94,47,056 టీకాలు అందించారు. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. 302మంది ఈ మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులు 216 రోజుల గరిష్టానికి చేరుకున్నాయి.
పాటిజివిటీ రేటు రోజురోజుకి పెరుగుతోంది. కొత్తగా నమోదైన కేసులు 7.74 శాతంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో కోవిడ్ పాజిటివిటీ రేటు 24.71 శాతంగా ఉంది. మహారాష్ట్ర, గోవాలో కూడా 20శాతంకు పైగా ఉంది.
సంఖ్య పరంగా ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో 25శాతం మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. ఈ రోజు 36,265మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. బెంగాల్‌లో 15,421, ఢిల్లీలో 15,095 కేసులు నమోదయ్యాయి.