మారుతున్న కాలం ప్రకారం ఆడపిల్లల పట్ల ఉన్న వివక్ష తగ్గుతూ వస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది మూర్ఖులు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్నారు.ఇలాంటి సమాజంలో కూడా అమ్మాయి పుడితే వరమంటున్నారు డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి సర్పంచి పానుగంటి రూప. తల్లిదండ్రుల్లో ఉన్న భయాన్ని దూరం చేసి అభయం ఇచ్చేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆడపిల్ల పుడితే రూ.5 వేల బాండ్ ఇస్తానని ప్రకటించారు. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..గ్రామంలో ఈ నెల 5 నుంచి ఏడాది పాటు అమలు చేస్తామన్నారు. గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించగా..ఏటా 20 లోపు మాత్రమే ఆడపిల్లకు సంబంధించిన జనన ధ్రువపత్రాలు తీసుకుంటున్నారని గుర్తించారు.
ఈ లెక్కన వీరి జననం తక్కువగా ఉంటుందని నిర్థారించుకొని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు తన వంతుగా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూప చెబుతున్నారు.అంతేకాకుండా తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివించేలా ప్రోత్సహించేందుకు సర్పంచి దంపతులు రూప-సతీష్ రెడ్డి మొదటి అడుగు వేశారు.
తమ పిల్లలు యోగితా రెడ్డి, రక్షిత రెడ్డిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. కూతురు పుడితే కుంటుంబంలో సంబరాలు చేసుకోవాలి. గ్రామంలో ఆడశిశువు జన్మిస్తే రూ. 5 వేలు ఇవ్వాలనే ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చింది. కొన్ని అనివార్య కారణాలతో అమలు చేయలేదు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని 2024 ఫిబ్రవరి 5 వరకు అమలు చేయనున్నట్లు సర్పంచ్ రూప తెలిపారు.