ఇటీవల కాలంలో రన్నింగ్ లో ఉన్న వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి. కొన్ని ప్రమాదాల్లో అందులో ప్రయాణిస్తున్న వారు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మరికొందరు ఆ మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ శివారులో జరిగింది.
డీటైల్స్ లోకి వెళ్తే.. షాద్ నగర్ సమీపంలోని ఓ రన్నింగ్ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. హైదరాబాద్ కు చెందిన నవీన్ అనే వ్యక్తి కుటుంబంతో సహా కారులో మహబూబ్ నగర్ బయల్దేరాడు. ఈ క్రమంలో షాద్‌నగర్ సోలిపూర్ శివారు ప్రాంతానికి రాగానే.. కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.
ఇది గమనించిన నవీన్.. ఒక్కసారిగా బ్రేక్ వేసి కారును పక్కకు ఆపేశాడు. కారులో ఉన్న తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి.. అందర్నీ కిందకు దించేశాడు. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే కారు మొత్తం మంటలు వ్యాపించి కాలి బూడిదై పోయింది.
నవీన్ సకాలంలో స్పందించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయటంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.