నడినెత్తిన నిప్పుల వాన కురిపిస్తున్న సూర్యుడు.. వరుణుడి దెబ్బకు మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. అకాల వర్షంతో హైదరాబాద్ చల్లబడింది. వేసవి ప్రారంభం నుంచి అధిక ఉష్ణోగ్రతలతో సూర్యుడు మాడు పగులగొడుతుండడంతో నగరవాసులకు ఈ వర్షంతో కాస్త ఉపశమనంగా అనిపిస్తోంది. అయితే.. కొన్ని చోట్ల కరెంట్ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడికి రావాల్సిన విమానాలను ముంబై, బెంగళూర్, ఢిల్లీ, వైజాగ్ ఎయిర్ పోర్టులకు మళ్లించారు. ఈదురు గాలులు, వర్షం రావడంతో కరెంట్ నిలిపివేశారు అధికారులు. కరెంట్ నిలిచిపోవడంతో శంషాబాద్ లో చీకట్లు అలముకున్నాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, షేక్ పేట్, మోహదీపట్నం, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు వర్షం నమోదైంది. భారీగా ఈదురుగాలులు వీయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
మలక్ పేట్ ప్రాంతంలో భారీ వృక్షం నేలమట్టమైంది. బలమైన ఈదురుగాలులకు తీగలగూడలో చెట్టు కూలిపోవడంతో ద్విచక్రవాహనం ధ్వంసమైంది. మరోవైపు రాష్ట్రానికి రాగల మూడు రోజుల పాటు వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.