భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ ఈ రోజు తాత్కాలికంగా రద్దు చేసింది. భద్రతా లోపాల నేపథ్యంలో ఈ రోజు యాత్రను నిలిపి వేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. యాత్రలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 11 కిలో మీటర్ల వరకు పాదయాత్ర చేయాల్సి వుంది. అయితే కిలోమీటర్ పాదయాత్ర చేసిన తర్వాత యాత్రను ఆపివేశారు.
ఈ మేరకు ఏఐసీసీ ఇంఛార్జ్ రజనీపాటిల్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో జమ్ము కశ్మీర్ అధికారులు విఫలమయ్యారని ఆమె పేర్కొన్నారు. భద్రతాపరమైన లోపాలు కేంద్ర పాలిత ప్రాంత అధికారుల సంసిద్ధత లేని నిర్లక్ష్య పూరిత వైఖరిని సూచిస్తున్నాయని ఆమె అన్నారు.
రాహుల్ గాంధీ శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో బనిహాల్ సొరంగాన్ని దాటిన తర్వాత ఆయన్ని కలిసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు దూసుకు వచ్చారు. అదే సమయంలో అకస్మాత్తుగా భద్రతను అధికారులు ఉపసంహరించారని కాంగ్రెస్ పేర్కొంది.
భారీగా జనం రావడంతో రాహుల్ గాంధీ సుమారు 30 నిమిషాల పాటు ఎటూ కదలలేకపోయారని చెప్పారు. దీంతో ఆయన్ని భద్రతా వాహనంలో తీసుకెళ్లి ఈరోజు యాత్రను నిలిపి వేసినట్టు పేర్కొన్నాయి. దీనిపై కాంగ్రెస్ నేత వేణుగోపాల్ స్పందించారు.
రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లాలకు భద్రత కల్పించేందుకు సరైన సంఖ్యలో పోలీసులు లేరని చెప్పారు. యాత్రలో చాలా తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయన్నారు. ఎలాంటి భద్రత లేకుండా రాహుల్ గాంధీ వెళ్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో తాము చాలా ఆందోళన చెందుతున్నామన్నారు.