పెళ్లిళ్లు పెటాకులు కావడానికి ఈ రోజుల్లో పెద్ద కారణాలు అవసరం లేకుండా పోయింది. సినిమాల్లో తాళి కట్టే సమయానికి ఆపండి.. ఆపండి.. ఆపండి.. అంటే ఆగిపోయినంత ఈజీగా ఇప్పుడు పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. డాడీ నాకు ఆ అబ్బాయి నచ్చలేదు అని పెళ్లికూతురు చెప్పింది. సరే తల్లి.. నీకు ఇష్టం లేకపోతే.. నేను చేసుకోలేను కదా..? పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం అని ఆ తండ్రి చెప్పాడు. దెబ్బకి అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు.
అసలు ఏం జరిగిందంటే?
తమిళనాడు కడలూరులోని పన్రుటిలో తెల్లారితే జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. దీనికి పెద్ద కారణం కూడా లేదు. జనవరి 20వ తేదీన జరగాల్సిన పెళ్లికి అమ్మాయి, అబ్బాయి తరుపు కుటుంబాలు అన్ని ఏర్పాటు చేసుకున్నాయి. పెళ్లికి ముందు రోజు సాయంత్రం రెండు కుటుంబాలు కలిసి రిసెప్షన్ ఏర్పాటు చేశాయి. అందరూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఇరు వర్గాలు సంగీత్ లో డ్యాన్సులు చేసి అలరించారు. పెళ్లి వేడుకకు వచ్చిన వధువు తరపు బంధువులు, స్నేహితులతో వధువు డ్యాన్స్ చేసింది.
అమ్మాయి అలా డ్యాన్సులు వేయడం వరుడుకి నచ్చలేదు. దీంతో.. ఆమెను స్టేజ్ పైకి పిలిచి అందరి ముందు లాగి చెప్ప దెబ్బ కొట్టాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పుడే అబ్బయి ఇలా ఉంటే తరువాత తన భవిష్యత్ ఎలా ఉంటుందో అంటూ పెళ్లి ఆపేయాలని వధువు అమ్మానాన్నలకు చెప్పింది. కూతురు మాట కాదనలేక తల్లిదండ్రులు పెళ్లి ఆపేసి రాత్రికి రాత్రే మండపం నుంచి ఇంటికి వచ్చారు. వారికి తెలిసిన సమీప బంధువుతో ముందుగా నిశ్చియించిన ముహుర్తానికే పెళ్లి చేశారు.