కేంద్రం మెడలు వంచుతాం.. ధాన్యం కొనిపిస్తామని గులాబీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఢిల్లీ దీక్షతో కేంద్రం దిగిరాక తప్పదని చెబుతున్నారు. అయితే.. అదంతా పెద్ద డ్రామా అని గులాబీల గూబ గుయ్ అనేలా కేంద్రం నుంచి రియాక్షన్ వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా టీఆర్‌ఎస్ నిరసన దీక్ష చేయడంతో కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే అన్నీ క్లారిటీగా మీడియాకు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. బియ్యం సేకరణఫై అన్ని రాష్ట్రాలను వివరాలు కోరామన్న ఆయన.. ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే సేకరిస్తామన్నారు. ఎఫ్సీఐ దగ్గర ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు మరో 20 లక్షల టన్నులు సేకరించామన్నారు.
ధాన్యంపై తెలంగాణ ఆరోపణలు అవాస్తవమని చెప్పిన సుధాంశు.. ఏపీ, తెలంగాణ రెండూ ఒకే జోన్ లో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రాని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. రా రైస్ ఎంతైనా సేకరించేందుకు ఎఫ్సీఐ సిద్ధంగా ఉందని.. ఈ మేరకు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని చెప్పారు. అందులో తెలంగాణ కూడా ఉందన్నారు.
ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని రైతులకు అవగాహన కల్పించాల్సింది కూడా అవేనని స్పష్టం చేశారు. పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదని.. తెలంగాణ నుంచి ఎంత రా రైస్ ఇచ్చినా తీసుకుంటామన్నారు. బియ్యం సేకరణలో ఏ రాష్ట్రంపై వివక్ష లేదన్న ఆయన.. ఏజెంట్ గా మాత్రమే రాష్ట్రాలు ధాన్యాన్ని సేకరిస్తాయని వివరించారు. ఎఫ్సీఐ నేరుగా ధాన్యం సేకరించడం సాధ్యం కాదని తెలిపారు సుధాంశు పాండే.