ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరికి ఊహించని పరిస్థితి ఎదురైంది. తన సోదరుడి కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సుధీర్ పై ఓ పోలీస్ అధికారి దాడికి పాల్పడ్డాడు. ఒకప్పుడు సెలబ్రిటీ హోదాలో తాను ప్రారంభించిన పోలీస్ స్టేషన్‌లోనే.. ఇప్పుడు తనపై దాడి జరిగిందని సుధీర్ కుమార్ వాపోయాడు. బీహార్ లోని ముజఫర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.
సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అసలు విషయమేంటో తెలుసుకుందామని అక్కడే లాకప్ లో ఉన్న సోదరుడితో మాట్లాడుతున్నాడు సుధీర్. ఆ సమయంలో డ్యూటీలో ఆఫీసర్ తన దగ్గరకు వచ్చి బూతులు మాట్లాడుతూ దూషించాడు. ఆపై రెండుసార్లు బూటు కాలుతో తనను తన్నాడు అని సుధీర్ ఆరోపించాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరించాడని చెప్తున్నాడు సుధీర్.
ఒకప్పుడు అదే ముజఫర్ పూర్ పోలీస్ స్టేషన్ ను సెలబ్రిటీ హోదాలో తానే ప్రారంభించానని సుధీర్ కుమార్ పేర్కొన్నాడు. ఇప్పుడదే పోలీస్ స్టేషన్ లో తనకు అవమానం జరగడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. సామాన్యుల పట్ల పోలీసుల జులుంకు ఈ ఘటన నిదర్శనమన్నాడు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని.. దీనిపై విచారణ జరిపిస్తామని వారు హామీ ఇచ్చారని సుధీర్ కుమార్ తెలిపాడు.
కాగా.. సుధీర్ కుమార్ సోదరుడిని ఓ భూ వివాదం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదానికి అతను సాక్ష్యంగా ఉన్నట్లు చెప్తున్నారు. సుధీర్ కుమార్ చౌదరిపై దాడి ఘటన తమ దృష్టికి రాలేదని ముజఫర్ పూర్ ఐజీపీ పేర్కొనడం గమనార్హం.