ఏపీలో లాక్ డౌన్ నుండి మినహాయింపుల పొంది ఓపెన్ అయిన లిక్కర్ షాపులు మహిళల ప్రాణాలకు ఎసరు తెచ్చింది. గత 40 రోజులుగా ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో మళ్లీ మద్యం చిచ్చు పెట్టింది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావటం, ఖర్చులు పెరిగిపోయినప్పటికీ మద్యం షాపులు ఓపెన్ కావటంతో మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తున్న భార్య, పిల్లలపై దాడులకు దిగుతున్నారు.
మద్యం షాపులు ఓపెన్ అయిన మొదటి రోజే ఏపీలో తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా పలమనేరుకు చెందిన లింగం సోమవారం మద్యం సేవించి, బార్య-బిడ్డలతో గొడవకు దిగాడు. తీవ్రంగా దూషించటంతో 22సంవత్సరాల కూతురితో కలిసి లింగం భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
ఇటు నెల్లూరు జిల్లాలోనూ ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసేందుకు లైన్ లో గంటల తరబడి నిల్చున్నారు. ఎండ దెబ్బకు తాళలేక ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.
ఇలా మద్యం షాపులు అలా ఓపెన్ అయ్యాయో లేదో ఇలా మహిళల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని… ప్రభుత్వం ఇచ్చిన మద్యపాన నిషేధం హమీని జగన్ సర్కార్ నిలబెట్టుకోవాలని ఏపీ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.