టీడీపీ నుంచి రెండుసార్లు రాజ్యసభ.. ఓసారి కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు సుజనా చౌదరి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఆ ఎంపీ పదవి టీడీపీదే. అయితే.. ఇప్పుడా ఆ పదవి టైమ్ కూడా అయిపోవచ్చింది. ఈ ఏడాది జూన్ 21తో మాజీ అయిపోతారు సుజనా. ఆయనతోపాటు ఏపీ నుంచి సురేష్ ప్రభు, టీజీ వెంకటేశ్, విజయసాయిరెడ్డి పదవీకాలం కూడా ముగుస్తుంది. మిగిలినవారి సంగతి ఏమోగానీ.. సుజనా చౌదరి సంచలన స్టెప్ తీసుకోబోతున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
2019 జూన్ 20న అప్పటి టీడీపీ రాజ్యసభాపక్ష నాయకుడుగా ఉన్న సుజనా చౌదరి, ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరారు. నలుగురు ఓసారి తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ పెద్దలు కూడా సాదరంగా స్వాగతం పలికారు. కేసుల నుంచి తప్పించుకోవడానికేనని ఓ వాదన.. చంద్రబాబు వ్యూహం అని మరో వాదన.. ఇలా రకరకాల చర్చలు జరిగాయి. అయితే.. అప్పటి నుంచి బీజేపీ ఎంపీలుగా చలామణీ అయ్యారు వీరంతా. గరికపాటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేత.. 2020తోనే ఆయన పదవీ కాలం పూర్తయింది. తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆయన్ను నియమించింది అధిష్టానం. అయితే.. తెలంగాణ, ఏపీ రాజకీయ పరిస్థితులు వేరు.
ఇప్పుడు సుజనాను బీజేపీ ఆదుకుంటుందా? మరోసారి రాజ్యసభ పదవి ఆఫర్ చేస్తుందా? అనేది పెద్ద ప్రశ్న. కానీ.. ఆయన మాత్రం సైలెంట్ గా అన్నీ చక్కబెట్టుకున్నట్లు సమాచారం. ఈసారి సుజనా చౌదరి జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి రాజ్యసభకు వెళ్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పార్టీ కాంగ్రెస్ భాగస్వామ్యంలో ఉంది. ప్రస్తుతం జార్ఖండ్ లో అధికారంలో కొనసాగుతోంది.
సుజనా చౌదరిపై జరుగుతున్న ఈ ప్రచారం నిజమైతే పెద్ద కీలక పరిణామమే. అయితే.. ఇంకో వాదన కూడా జరుగుతోంది. బీజేపీని కాదని సుజనా బయటకు వెళ్తే పరిస్థితులు వేరేలా ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. మొత్తానికి ఆయన జేఎంఎం నుంచి రాజ్యసభకు వెళ్తున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి ప్రచారమే. దీనిపై ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని సమాచారం.