ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం లలో ఏనోట విన్నా ఒకటే హవా నడుస్తోంది. అదే డార్లింగ్ ప్రభాస్ హీరోగా 300 కోట్ల భారీ బడ్జెట్ లో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన “సాహో”. ఐదేళ్ళు వేరే ఏ సినిమా చెయ్యకుండా రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి కోసం డేట్స్ కేటాయించి, అదయిన వెంటనే మళ్ళీ “సాహో”కు రెండేళ్ళు డేట్స్ ఇవ్వడమే ఒక పెద్ద సాహసం. అందునా 300 కోట్లు వెచ్చించి మరీ కేవలం తన రెండవ సినిమా తెరకెక్కిస్తున్న ఒక కొత్త దర్శకుడితో సొంత బేనర్ లో సినిమా తియ్యడమంటే అది పెద్ద రిస్కే అనుకోవాలి.
ఏదేమైనా మొత్తానికి కాస్త ముందూ వెనకా అయినా సరే సినిమా ఈ ఆగస్ట్ 30న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ చోట్ దర్శకుడు సుజీత్ తన “సాహో” సినిమా కథ గురించి ఓ చిన్న లీకు వదిలాడు. సాహోలో సెకండ్ హాఫ్‌లో వచ్చే ఓ ట్విస్ట్ కేవలం ప్రభాస్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులందర్నీ గొప్ప థ్రిల్‌కు గురి చేస్తుందట. మరి ఇంతకీ అదేమై ఉంటుందబ్బా?
సినిమాల్లో పుట్టి, సినిమాల్లో బ్రతుకుతూ, సినిమాల పోకడలను వంటబట్టించుకున్న సినీపండితులు కొందరు ఇదే ఆ ట్విస్ట్ అంటూ చెబుతున్నారు. సినిమా ట్రైలర్ జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభాస్ “అశోక్ చక్రవర్తి” అనే అండర్ కవర్ కాప్‌గా చేస్తున్నట్టు చూపించారు. ఇకపోతే సాహో టీజర్‌లో చూస్తే, ఆ భారీ ఛేజింగ్ సీన్స్‌లో ప్రభాస్‌ను పోలీసులు తరిమినట్టు చూపించారు. అంటే ప్రభాస్ అండర్ కవర్ కాప్ కాదు, ధూం 2 లో హృతిక్ రోషన్‌లా చాకచక్యంగా పని చేసుకుపోయే ఒక దొంగ కావచ్చు అని చెబుతున్నారు. ఇదే కాబోలు ఆ గొప్ప ట్విస్ట్.
ఏదేమైనా ఇంతవరకు మనం టీజర్ అండ్ ట్రైలర్స్‌లో చూసిన విజువల్స్ పరంగా చూస్తే మాత్రం సాహో సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో కనిపిస్తోంది. కచ్చితంగా సాహో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే చిత్రమవుతుందని చెప్పుకోవచ్చు. 300 కోట్లు వెచ్చించి నిర్మించిన సాహో ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా దాదాపుగా 400 కోట్లకు పైగానే సంపాదించిందట. నిర్మాతలు ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోయినట్టే, మరి భారీగా డబ్బు వెదజల్లి డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్న వారి పరిస్థితి తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే!