తన గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ కి ఛీటర్ సుఖేష్ చంద్రశేఖర్ హ్యాపీ హోళీ అంటూ విషెస్ చెప్పాడు. ఫోర్టిస్ కంపెనీ మాజీ ప్రమోటర్ ని 200 కోట్ల రూపాయలకు పైగా మోసగించిన కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇతగాడు.. జాక్విలిన్ కి రాసిన ‘లవ్ లెటర్’ లో హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే మీడియాకు, తన కుటుంబానికి, తన సపోర్టర్లకు, చివరకు తనను ద్వేషిస్తున్నవారికి కూడా విషెస్ చెప్పాడు.
తాను ఎప్పటికప్పుడు చెబుతున్న విషయాలను అందరికీ తెలిసేట్టు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను ‘మోస్ట్ ఫాంటాస్టిక్ హ్యూమన్ గా అభివర్ణిస్తూ.. తానెంతో ఆరాధించే అందగత్తెకు ఇవే నా గ్రీటింగ్స్ అని పేర్కొన్నాడు. ఈ రంగుల పండుగ రోజున గతంలో మెరిసి మాయమైపోయి.. కనుమరుగైపోయిన అందాల రంగులు మళ్ళీ నిన్ను ‘పలకరిస్తాయని’ ఆశిస్తున్నానని, ఇందుకు ఈ సారి తానే బాధ్యత వహిస్తానని, కవితాత్మకంగా పేర్కొన్నాడు,
సదా చిరునవ్వు నవ్వుతూ ఉండాలని, నేనెవరో నీకు తెలుసునని, అంటూ.. ఇంకా ‘లవ్ యూ మై ప్రిన్సెస్, మిస్ యూ లోడ్స్, మై బీ, మై బొమ్మ, మై లవ్ అంటూ ప్రేమ మైకంలో మైమరచిపోయాడు . లోగడ ఢిల్లీ కోర్టులో తనను హాజరుపరిచినప్పుడు కూడా వాలెంటైన్స్ డే నాడు సైతం ఆమెకు విషెస్ చెప్పాడు.
గత నెలలో సుఖేష్ చంద్రశేఖర్ పై ఈడీ తాజాగా మనీలాండరింగ్ కేసు పెట్టి ఆరెస్టు చేసింది. తనను కేంద్ర స్థాయిలో పెద్ద ఉద్యోగిగా చెప్పుకుంటూ రెలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను ఇతగాడు చీట్ చేశాడు. ఇది ఇతనిపై ఈడీ పెట్టిన మూడో కేసు. ఇంకా ఏఐడీఎంకే బహిష్కృత నేత వీకే.శశికళ వర్గానికి ఈసీ నుంచి ‘రెండాకుల’ గుర్తు లభించేలా చూస్తాని కూడా చంద్రశేఖర్ టోకరా ఇచ్చాడు.