కరోనా వైరస్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పి ఇంట్లో కూర్చుంది. స్టార్ హీరోల దగ్గర నుండి అసిస్టెంట్ బాయ్స్ వరకు అంతా రెస్ట్‌లోనే ఉన్నారు. అయితే… డైరెక్టర్ సుకుమార్ మాత్రం కరోనా వైరస్‌కు ఏమాత్రం భయపడకుండా… షూటింగ్ గ్యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాడట.
రంగస్థలం సూపర్ సక్సెస్ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. చిత్తూరు జిల్లా గందపు చెక్కల బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఇప్పటికే కొంతమేర షూటింగ్ చేశారు. కానీ ఆ తర్వాత కేరళ ప్రభుత్వం ఇప్పుడు షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం లేదు.
దీంతో… లోకేషన్‌ల వేటలో పడ్డారు సుకుమార్. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, మారేడుపల్లి దట్టమైన అటవీ ప్రాంతాల్లో తనకు అనువుగా ఉండే ప్రాంతాలను జల్లెడ పడుతున్నారట సుకుమార్. షూటింగ్‌లు మొదలైన వెంటనే పని ప్రారంభించాలని, ఏమాత్రం ఆలస్యం చేయొద్దన్న కసితో… కరోనా వైరస్‌ను కూడా లెక్కచేయకుండా లోకేషన్స్ ఫైనల్ చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
అల్లు అర్జున్-రష్మిక మందన్న హీరో హీరోయిన్‌లుగా వస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, విజయ్ సేతుపతి, యాంకర్ అనసూయలు కీలక రోల్ చేస్తుండగా… దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం దసరా సెలవుల బరిలో ఉండబోతుంది.