యాంకర్ సుమంటే నవ్వుల పువ్వులు పూస్తాయి. పంచుల సంచులు నిండుతాయి.అందుకే సుమంటే ఓ లాఫు..సుమంటే ఓ స్పూఫు..! అయితే ఇటీవల ఓ ప్రోగ్రామ్ లో యాంకరింగ్ కి గ్యాప్ ఇస్తున్నానంటూ ఎమోషనైంది.
దశకానికి పైగా ఆమె యాంకరింగ్ లో హోల్డై ఉన్న అభిమానులు అంతో ఇంతో ఎమోషనవడం సహజం…! ఆమేరకు ఆతృత పెరగడం కూడా సాధారణం. కాకపోతే యాంకర్ సుమ అలాంటి ఎమోషన్ కి లోనైందంటే లోక కళ్యాణానికో, మరిన్ని నవ్వులు పూయించడానికో అయ్యుంటుంది అనడంలో సందేహం లేదు.
ఊహించినట్టుగానే సుమ స్పందించింది. అది ప్రోగామ్ తాలూకు ఓ ప్రోమో…అంతా తూచ్..! మిమ్మల్ని అంత తేలిగ్గా వదలను అని వీడియోలో క్లారిటీ ఇచ్చింది. ఆ ఎమోషనల్ ప్రోమోతాలూకు పరమార్థం ఆమె మాటల్లో “హలో రీసెంటుగా ఓ న్యూ ఇయర్ ఈవెంట్ చేయడం జరిగింది, అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది, ఆ షోలో ఎమోషనల్ అయ్యాను.
కానీ అది ఎందుకో ఎపిసోడ్ చివరల్లో తెలుస్తుంది. కంగారు పడకండి..నాకు చాలా మంది ఫోన్లు,మెసేజులు చేసి నిజమేనా అని అడుగుతున్నారు. నేను బుల్లితెర కోసమే పుట్టాను.ఎంటర్ టైన్మెంట్ కోసమే పుట్టాను.నేను ఎటూ వెళ్ళడం లేదు.
హ్యాపీగా ఉండండి.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వీడియోను తానే ట్విట్టర్ నుంచి డిలీట్ చేసింది. ఎందుకలా చేసింది అనే ప్రశ్నలకు మాత్రం క్లారిటీ రావటం లేదు.
అయితే సదరు ప్రోగ్రామ్ మీద మొదలైన బజ్ ఇంకా కంటిన్యూ చేయడానికా..?! లేదా, ఇప్పుడే అలాంటిదేమీ లేదని చెప్పేస్తే ప్రోమో ప్రోగ్రామ్ కి అనుకున్న వ్యూవర్షిప్ రాదనా ?! అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.
ఏది ఏమైనా మళయాళీగా పుట్టి తెలుగింటికోడలిగా,అందరి అభిమాన యాంకర్ చేసిన జర్నీని తలుచుకుంటే ఆ స్టేజ్ లో ఉన్న ఎవరికైనా నిజంగానే ఎమోషనవుతారు. కాకపోతే సుమ జగమొండి.! ఎంత బాధనైనా నవ్వు రెప్పల్తో కప్పేస్తుంది!