బుల్లితెరపై ఆమె సూపర్ స్టార్. వరుస టీవీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, టిఫిన్, లంచ్ లాంటివన్నీ ఆమె సెట్స్ లోనే కానిచ్చేస్తుంది. అలా రోజుకు 2 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తుంది సుమ. ఇంత బిజీగా ఉన్న ఈ యాంకర్, చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది. తన సంపాదనను కూడా పక్కనపెట్టి ఈ సినిమా చేసింది.
“అవును.. నిజమే. నేను చాలా సంపాదన కోల్పోయాను. ఈ సినిమాకు కేటాయించిన టైంలో ఎన్నో టీవీ షోలు చేసి సంపాదించవచ్చు. అలా చాలా ఆదాయం మిస్ అయింది. కానీ నా స్టామినా ఏంటో తెలియజేయాలంటే సినిమా చేయాల్సిందే. అందుకే జయమ్మ పంచాయితీ సినిమా చేయాలనుకున్నాను. మన సత్తా ఏంటో తెలియాలంటే సినిమా చేయాల్సిందే. ఇదే సరైన నిర్ణయం. అందుకే ధైర్యంగా ముందడుగు వేశాను.”
ఇలా తను ఆదాయం కోల్పోయిన విషయాన్ని బయటపెట్టింది సుమ. తన నెల సంపాదనతో పోల్చి చూస్తే, సినిమా కోసం తీసుకున్న పారితోషికం చాలా తక్కువంటోంది సుమ. కానీ కథ నచ్చడంతో పాటు తనలోని నటిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో సినిమా చేసినట్టు వెల్లడించింది.
ఇక తన తనయుడు రోషన్ గురించి స్పందించింది సుమ. రోషన్ కు నటన అంటే చాలా ఇష్టమంట. చిన్నతనం నుంచి అదే గోల్ తో పెరిగాడంట. త్వరలోనే అతడు సినిమాల్లోకి వస్తాడని చెబుతోంది సుమ. అంతకంటే ముందు సినిమాలో కష్టాలు రోషన్ కు తెలియాలని, అందుకే కొన్ని క్రాఫ్టుల్లో పనిచేసేలా రోషన్ ను ప్రోత్సహిస్తున్నామని తెలిపింది.