టక్ జగదీశ్ సినిమాను నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చినప్పుడు నాని తెగ ఇబ్బంది పడ్డాడు. తప్పక ఓటీటీకి ఇచ్చేశాం అంటూ చేతులు పిసుక్కున్నాడు. నారప్ప, దృశ్యం2 ఓటీటీకి వెళ్లినప్పుడు వెంకటేశ్ కూడా దాదాపు ఇలానే రియాక్ట్ అయ్యాడు. “ఏముందమ్మా ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్” అన్నాడు. అయితే హీరో సుమంత్ మాత్రం దీనికి కాస్త భిన్నంగా స్పందించాడు. ఓటీటీని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన టైమ్ వచ్చిందని, నేరుగా ఓటీటీలో ఓ సినిమా రిలీజ్ చేయడం అనేది కామన్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
“మూడేళ్ల కిందటైతే నా సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవ్వాలని చెప్పేవాడ్ని. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఓటీటీ బాగా పెరిగింది. ఇక్కడే కాదు, బాలీవుడ్-హాలీవుడ్ లో ఓటీటీ వచ్చేసింది. పెద్ద పెద్ద హీరోలే ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. దాన్ని మనం కాదనలేం. ఇవన్నీ పక్కనపెడితే.. నా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలా, ఓటీటీలో రిలీజ్ చేయాలా అనే విషయాన్ని నేను ఆలోచించను. అది నిర్మాత పని. వాళ్లు డబ్బులు పెట్టినప్పుడు, నిర్ణయం కూడా వాళ్లదే. నాకు ఓటీటీ ఓకే.”
ఇలా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ పై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేశాడు సుమంత్. అంతేకాదు.. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న అహం-రీబూట్ అనే సినిమా కూడా నేరుగా ఓటీటీలోకే వస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో పాటు అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్నానని, బహుశా అ సినిమా మాత్రం థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రకటించాడు ఈ హీరో.
ఇతడు నటించిన మళ్లీ మొదలైంది సినిమా నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. శుక్రవారం ఈ సినిమాను జీ5లో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కీర్తికుమార్ దర్శకుడు.