మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన వర్గం తమ ఎన్నికల చిహ్నాలపై క్లారిటీ ఇచ్చింది. తమకు సూర్యుడు, ఖడ్గం, షీల్డ్, మర్రి చెట్టు .. వీటిలో ఏదో ఒకదానిని కేటాయించాలని ఈసీని కోరింది. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే అధ్వర్యంలోని సేన క్యాంప్.. తమకు వెలుగుతున్న టార్చ్ కావాలని అభ్యర్థించింది. ఈ వర్గానికి పేరును ఈసీ.. శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే గా నిర్ణయించగా .. షిండే వర్గానికి పేరును బాలాసాహెబ్ అంచి శివసేన (బాలాసాహెబ్ శివసేన) గా ప్రకటించింది. తమకు కొత్త పేర్లను కేటాయించినందుకు రెండు వర్గాలూ సంతృప్తిని ప్రకటించాయి.
పార్టీలకు ఎలాంటి మతపరమైన చిహ్నాలను కేటాయించబోమని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మొదట ఈ రెండు శిబిరాలూ తమకు త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు ఎన్నికల చిహ్నాలుగా కేటాయించాలని కోరాయన్నారు.
కానీ త్రిశూలం, గద ..రెండూ మతపరమైన గుర్తులుగా కనిపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణం వల్లే ఈ ఆప్షన్స్ ని రాజీవ్ కుమార్ తోసిపుచ్చారని ఈసీ వర్గాలు తెలిపాయి.
వెలుగుతున్న టార్చ్ గుర్తును లోగడ సమతా పార్టీకి కేటాయించారు. అయితే 2004 లో ఈ పార్టీ గుర్తింపును ఈసీ రద్దు చేసింది. 1985 లో ఈ గుర్తుతో శివసేన ఎన్నికల్లో గెలిచింది. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే నెల 3న జరగనుంది. అందువల్లే ఈ రెండు వర్గాలూ తమకు త్వరగా ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని పట్టు బడుతున్నాయి.