వనమా రాఘవను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే కేసీఆర్, కేటీఆర్ లకు గాజులు పంపుతామని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు వార్నింగ్ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ ఘటనలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆమె తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు మహిళా సమస్యలు పట్టవా? రాష్ట్ర మహిళ మంత్రులకు ఈ ఘటనపై మాట్లాడే తీరిక లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రభుత్వం, పోలీసులకి సిగ్గు శరం లేదని ధ్వజమెత్తారు. నిందితుడిని కావాలనే అరెస్టు చేయడం లేదనే అనుమానం తమకు కలుగుతోందని ఆమె ఆరోపించారు. వనమా రాఘవకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టు చేయడంలో ఉన్న చిత్తశుద్ధి నేరాలు చేసిన అధికార పార్టీ నేతలను అరెస్టు చేయడంలో లేదా అని పోలీసులను ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. 24గంటల డెడ్ లైన్ పెడుతున్నామని.. వనమా రాఘవని అరెస్టు చేయకపోతే సీఎం కేసీఆర్, కేటీఆర్ కు గాజులు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. మనువడిని ఒక మాట అంటే గగ్గోలు పెట్టిన కేసీఆర్.. ఒక కుటుంబం అన్యాయం అయిపోతే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు తక్షణమే రాజీనామా చేయాలని సునీతా రావు డిమాండ్ చేశారు.