స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్, నటుడు సునీల్ మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం కాకముందు నుంచే వీళ్లిద్దరూ స్నేహితులు. హైదరాబాద్ పంజాగుట్టలో ఒకే రూమ్ లో ఉండేవారు. ఆ రూమ్ ను వాళ్లు ఇంకా మరిచిపోలేదు. ఇప్పటికీ ఆ రూమ్ కు అద్దె చెల్లిస్తున్నారు. అప్పుడప్పుడు వెళ్లి ఆ గదిలో కూర్చొని వస్తుంటారు.
ఇంత మంచి అనుబంధం ఉన్న వీళ్లిద్దరి మధ్య అభిప్రాయబేధాలు సృష్టించే ప్రయత్నం చేశారు కొంతమంది. సునీల్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ ఆదుకోలేదని కొందరు అన్నారు. హీరో వేషాలు వదిలేసిన తర్వాత సునీల్ కు త్రివిక్రమ్ మంచి పాత్ర ఒక్కటి కూడా ఇవ్వలేకపోయాడని ఇంకొందరు అన్నారు. వీటన్నింటిపై సునీల్ స్పందించాడు.
తనది, త్రివిక్రమ్ ది సినిమాలతో సంబంధం లేని అనుబంధం అని చెప్పుకొచ్చాడు సునీల్. సునీల్ తనకు సినిమాల్లో మంచి పాత్రలు ఇవ్వలేకపోవచ్చని.. కానీ అలాంటి చిన్న పాత్రల్నే పువ్వులుగా చేసి, రాబోయే రోజుల్లో తన మెడలో పెద్ద హారాన్ని వేసే సత్తా త్రివిక్రమ్ కు ఉందన్నాడు.
అల వైకుంఠపురములో తనది చిన్న పాత్ర అనే విషయం తనకు తెలుసన్నాడు సునీల్. ఇక భీమ్లానాయక్ లో కేవలం పాట కోసం మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోతాననే విషయం కూడా తెలుసన్నాడు. ఇవన్నీ త్రివిక్రమ్ తనకు చెప్పే తీసుకున్నాడని.. అలాంటి ఒకట్రెండు సినిమాల వల్ల తమ అనుబంధం దెబ్బతినదని అంటున్నాడు.