దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత మార్పులకు దిగింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ సంఘటన మంత్రిగా(ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ) సునీల్ బన్సాల్ నియామకం అయ్యారు. ఈయన కేంద్రమంత్రి అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ కో ఇంఛార్జ్ గా పని చేశారు బన్సాల్. అలాగే ఉత్తరప్రదేశ్ బీజేపీ సంఘటన మంత్రిగా ఉన్నారు. యూపీ ఎన్నికల్లో 2017లో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధాన ప్రణాళికా కర్తగా వ్యవహరించారు.
వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఇప్పటి నుండే బీజేపీ జాతీయ నాయకత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీల విషయంలో ఈ మార్పులు చేస్తోంది. మొన్నటివరకు తెలంగాణలో ఈ పదవిలో మంత్రి శ్రీనివాసులు ఉన్నారు. ఆయన్ను పంజాబ్ లో పార్టీ బలోపేతం కోసం అక్కడకు పంపించింది.
2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పంజాబ్ సంఘటన మంత్రిగా శ్రీనివాసులును పంపి.. తెలంగాణకు సునీల్ బన్సాల్ ను నియమించారు. తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన అధిష్టానం.. అమిత్ షాకు దగ్గరి మనిషిని రంగంలోకి దింపడంతో వచ్చే ఎన్నికలపై ఎలాంటి వ్యూహాల్లో ఉందో అర్థం అవుతోందని అనుకుంటున్నారు.