బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ బన్సల్ తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. రాష్ట్రంలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు రేపు ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్లపై పర్యటించి పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్నారు.
కూకట్ పల్లిలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ఆయన రేపు ఉదయం సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు.
ఇందులో పార్లమెంట్ నియోజక వర్గ కన్వీనర్ సహ కన్వీనర్, పార్లమెంట్ ప్రభారి, పార్లమెంట్ విస్తారక్‌లో ఆయన సమావేశం కానున్నారు. మెదక్ సెగ్మెంట్ కు చెందిన నేతలతో ఆయన పటాన్ చెరులో గురువారం భేటీ కానున్నారు. ఆ తర్వాత అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ అవుతారు.
ఈ రెండు రోజుల పాటు పలు సమావేశాల్లో పార్టీ పటిష్టత, ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై నేతలతో ఆయన చర్చిస్తారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టడంపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించనున్నారు.