సునీల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హిందీలో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. వీటిలో ఒక సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు సునీల్. ఇక మరో సినిమాలో హీరో పక్కన ఉండే మెయిన్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు.
పుష్ప సినిమాలో కరడుగట్టిన విలన్ గా కనిపించాడు సునీల్. ఆ సినిమా హిందీలో సూపర్ హిట్టయింది. అదే తనకు బాలీవుడ్ ఆఫర్లు తెచ్చిపెట్టిందని తెలిపాడు సునీల్. ఈ విషయంలో సుకుమార్, బన్నీకి తను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు.
కేవలం హిందీ సినిమాలే కాకుండా.. తనకు తమిళ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలిపాడు ఈ నటుడు. తమిళ్ లో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించాడు. అక్కడ 2 సినిమాల్లో విలన్ గానే కనిపించబోతున్నాడట ఈ నటుడు.
ఇక తెలుగు విషయానికొస్తే.. ప్రస్తుతం విలన్, కమెడియన్, ప్రత్యేక పాత్రలకు మాత్రమే పరిమితమయ్యాడు సునీల్. త్వరలోనే హీరోగా తెలుగులో రీఎంట్రీ ఇస్తానంటున్నాడు. కొంతమంది నిర్మాతల అడ్వాన్సులు తన దగ్గర ఉన్నాయని, వాళ్ల కోసం హీరోగా మరోసారి ముఖానికి రంగేసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపాడు. అన్ని పాత్రల కంటే, హీరో వేషాలు వేయడమే చాలా కష్టమని చెప్పుకొచ్చాడు ఈ నటుడు.