కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైం విచారణకు హాజరయ్యారు. వార్ రూమ్ కేసులో ఆయన ఈ రోజు సీసీఎస్‌కు వచ్చారు. ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాల్సి వుండగా కాస్త లేటుగా వచ్చారు. సుమారు గంట పాటు ఆయన్ని పోలీసులు ప్రశ్నించారు.
విచారణ ముగిసిన అనంతరం ఆయన సీసీఎస్ నుంచి వెళ్లిపోయారు. అనారోగ్యకారణాలతో ఆయన ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను సీసీఎస్ ఏసీపీ ఖండించారు. విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలుకు నోటీసులు ఇచ్చామన్నారు. విచారణకు హాజరవుతానని సునీల్ కనుగోలు సమాచారం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆయన రావడం లేదని తమకు ఎలాంటి లేఖ అందలేదన్నారు.
ఈ వార్తల నడుమ సునీల్ కనుగోలు విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంతో పాటు నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ వార్ రూమ్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి 41 సీఆర్పీసీ కింద సునీల్ కనుగోలుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఈ క్రమంలో వాటిని రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టు మెట్లెక్కారు. సీసీఎస్ పోలీసుల జారీ చేసిన నోటీసులపై స్టే విధించలేమని ఈ నెల 3న హైకోర్టు తేల్చి చెప్పింది. 9న జరిగే సైబర్ క్రైం విచారణకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.