కాంగ్రెస్ కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. అలాంటి పార్టీని అధికారానికి దూరం చేయడం అంటే మాటలు కాదు. 2014లో నమో మంత్రం అది చేసి చూపించింది. ఆ తర్వాత బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. వరుసగా ఒక్కో రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడుతూ వస్తోంది. అయితే.. ప్రధాని మోడీ పోటీ చేసిన విజయాలు మాత్రం ఎంతో ప్రత్యేకం.
2014 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి, వడోదరా నియోజకవర్గాల నుంచి మోడీ పోటీ చేశారు. ఆ రెండు నియోజక వర్గాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో మరోసారి వారణాసి నుంచి పోటీ చేసి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. వారణాసిలో రెండుసార్లు మోడీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు ఓ వ్యక్తి. ఈ విషయం పార్టీలో ఉన్నవారికి తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన ఎవరో కాదు సునీల్ ఓజా.
వాస్తవానికి ఆ రెండు లోక్ సభ ఎన్నికలే కాదు.. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారణాసి జిల్లాలో బీజేపీని విజయపథంలో నడిపించారు ఓజా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాత్ర మరింత కీలకం. నోటిఫికేషన్ వచ్చింది మొదలు ఓజా తన వ్యూహాలను అమలు చేశారు. యూపీలో గెలవడం ఒక టార్గెట్ అయితే.. ప్రధాని నియోజకవర్గంలో తప్పకుండా గెలిచి ప్రతిష్ట కాపాడుకోవడం ఇంకో ఎత్తు.
సునీల్ ఓజాను ఏవీ కలవర పెట్టలేదు. ఎందుకంటే ఆయన టార్గెట్ ఫిక్స్ అయితే.. గెలుపు ఖాయమే. మోడీ కూడా ఆయనపై అంతే నమ్మకాన్ని ఉంచారు. ఓవైపు ప్రచారంలో బిజీగా ఉంటూనే ఇంకోవైపు ఎప్పటికప్పుడు సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహించేవారు సునీల్ ఓజా. కింది స్థాయి కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి ఉన్న సందేహాలను తీర్చి పార్టీని జనంలోకి తీసుకువెళ్లేలా చేశారు.
రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆయన అందెవేసిన చేయి. మొదట్లో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీల్లో పని చేసిన కాలం నుంచి సాధారణ ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే జనాల నాడిని ఆయన ఇట్టే పట్టుకోగలరు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది అని విశ్లేషణలు చేయగలరు. పరిస్థితులకు అనుకూలంగా అప్పటికప్పుడు వ్యూహాలను రచించడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే మోడీలాంటి వ్యక్తి ఓజాకు తన గెలుపు బాధ్యతను అప్పగించారు.
ఇక ఇన్ని విజయాలు సాధించిపెట్టినా తనను తాను సాధారణ కార్యకర్తగానే చెప్పుకుంటారు సునీల్ ఓజా. పార్టీ విజయంలో తన పాత్ర ఉన్నప్పటికీ దాని క్రెడిట్ మొత్తం పార్టీకి, కార్యకర్తలకు మాత్రమే ఆయన ఇస్తారు. బీజేపీలో ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ.. దేశ హితం కోసం పాటుపడుతూ ఉంటారు. అందుకే తమది కార్యకర్తల పార్టీ అని చెబుతుంటారు బీజేపీ నేతలు.