సుంకేట అన్వేష్ రెడ్డి.. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్
తరుగు పేరుతో దోపిడీ చేస్తే రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్ కు నిజంగా అంత దమ్ముందా..? ప్రతి రోజూ పత్రికల్లో తరుగు తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకు వాటి మీద కమలాకర్ నోరువిప్పడంలేదు. అలాంటి మిల్లుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వాళ్లతో మంత్రికి ఏమైనా లాలూచీ ఉందా..? లేక చర్యలు తీసుకునే ధైర్యం లేక మొగసాలు మాటలు మాట్లాడుతున్నారా..? తూకం వేసిన తర్వాత రైతులకు ట్రాక్ సిట్ ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి పత్రికా ముఖంగా రైతులకు, ప్రజలకు వివరించి చెప్పాలి.
రైతులకు ట్రాక్ సిట్ ఇవ్వకపోవడం వెనుక మంత్రి హస్తం లేదా? మంత్రికి ధమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, సిగ్గుంటే ఇప్పటి వరకు కొన్న ధాన్యానికి సంబంధించిన ట్రాక్ సిట్లు బయట పెట్టాలి. ఇవ్వకుండా రైతులను దోపిడీ చేస్తున్నా మాట వాస్తవం కాదా?. బహిరంగ చర్చకు వస్తే ఆధారాలతో సహా మిల్లర్ల దోపిడీని మేము నిరూపిస్తాం. మంత్రి గంగుల నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రా.. నువ్వు చెప్పిన చోటుకే.. నువ్వు చెప్పిన సమయానికే అన్ని ఆధారాలతో నీ దగ్గరకు వస్తాం.. నువ్వు చర్చకు సిద్ధమా..?
రెండేళ్లుగా మిల్లర్ల చేతిలో కొనుగోలు వ్యవస్థను పెట్టి రైతుల బతుకులను ఆగం చేసింది మీ మొదనష్టపు, దరిద్రపు ప్రభుత్వం కాదా..? పరిగి నియోజకవర్గంలోని కేవలం నాలుగు గ్రామాల్లోనే రైతులకు రూ. 20 లక్షలు తక్కువగా వచ్చాయని మేము ఆధారాలతో సహా.. సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. ఏడాది గడుస్తున్నప్పటికీ.. ఇంతవరకు ఆ రైతులకు న్యాయం జరగలేదు. కేవలం నాలుగు గ్రామాల్లోనే ఇంత దోపిడీ చేశారంటే.. రాష్ట్రం మొత్తం మీద ఇంకెంత దారుణంగా మీరు రైతుల కష్టంతో సొమ్ము చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రతీ లారికి రూ. 30 నుండి రూ. 40 వేల వరకు రైతుల కష్టాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారు. అయినా గంగుల మౌనంగా ఎందుకు ఉంటున్నారు..? మిల్లు యజమానులను ఎందుకు ప్రశ్నించడంలేదు.. అందులో మీకెంత వాటా అందుతుంది గంగులా..? పౌరసరఫరాల శాఖ మంత్రిగా తరుగు పేరు మీద నడుస్తున్న దోపిడీకి మీరే బాధ్యత వహించాలి. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత మిల్లర్లతో రైతులకు ఏమిటి సంబంధం. అసలు మీరు సైలెంట్ అవడానికి కారణం ఏమిటి మీడియా ముఖంగా ప్రజలకు చెప్పాలి.