మహేశ్ అను నేను.. - Tolivelugu

మహేశ్ అను నేను..

సినిమా స్టార్ల రాజకీయాలు చాలా డిఫరెంటుగా వుంటాయి. అందులో టాలివుడ్ పాలిటిక్స్ మరీ దారుణం. టీడీపీ చంద్రబాబుకు సొంతమనుకునే సినీ పెద్దలు కూడా ఇటీవలి కాలంలో కేసీఆర్ సర్కార్ దూకుడు చూసి సైకిల్ మూలన పడేసి కారెక్కడం షురూ చేశారు. ఆఖరికి కమెడియన్ అలీ కూడా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడానికి అన్నీ సిద్ధం చేసుకుని తర్వాత మనసు మార్చుకుని జనసేనలోకి వెళ్లాలనుకున్నాడు. చిట్టచివరి నిమిషంలో వెళ్లి వైసీపీలో చేరిపోయాడు. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్ అతని రాజకీయ భవితవ్యాన్ని తేల్చేసిందని అప్పట్లో టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి కూడా. ఇప్పుడు మహేశ్‌బాబు అటు ఏపీలో, ఇటు తెలంగాణలో అధికార పీఠంపై వున్న పెద్దలతో కాస్త ఎక్కువ టచ్‌లో వుంటున్నట్టు కనిపిస్తోంది.

తెలంగాణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే కేటీఆర్​కు సూపర్​స్టార్​ మహేశ్​బాబు మద్దతు తెలిపాడు. ప్రజలు జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు కేటీఆర్ కొన్ని సూచనలు చెప్పగా, వాటిని పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు మహేశ్‌బాబు. కాజ్ మంచిదే. కానీ, ‘అదేదో కేటీఆర్ మినిస్టర్ అయ్యాక చెప్పేకంటే.. విష జ్వరాలు పదిహేను రోజుల ముందు నుంచి వున్నాయి కదా.. అప్పడు చెప్పొచ్చు కదా ఈ సలహా’ అంటూ టీఆర్ఎస్ వ్యతిరేకులైన అభిమానులు మహేశ్ మీద మండిపడుతున్నారు.

మహేశ్‌బాబు బావ జయదేవ్ గల్లా టీడీపీలో యాక్టీవ్ పొలిటీషియన్. జయదేవ్ గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రోజుల్లో.. మహేశ్‌బాబు అదే సమయంలో భరత్ అను నేను అనే మూవీ తీశాడు. ఆ మూవీలో కొన్ని పాటలు, సీన్లు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌లకు అనుకూలంగా వున్నాయని అప్పట్లో టీడీపీ శ్రేణులు మహేశ్‌బాబు మీద మండిపడ్డారు. అందులో యువకుడైన ముఖ్యమంత్రి పాత్ర అచ్చంగా జగన్ నిజ జీవిత పాత్ర పోలికలతో వున్నదని, సినిమాలో రచ్చబండ వంటి పద ప్రయోగాలు కూడా వైఎస్ ప్రభుత్వానికి సంబంధించినవేనని విమర్శలు వచ్చినా మహేశ్ లక్ష్యపెట్టలేదు. సినిమా సినిమానే, రాజకీయాలు రాజకీయాలే అనుకున్నారంతా. ఐతే, జగన్ ఎన్నికల ప్రచారంలో ఈ సాంగ్ రాష్ట్రమంతటా మార్మోగింది. తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పదవీ ప్రమాణం చేసిన రోజు పత్రికలన్నీ జగన్ అను నేను అంటూ పతాక శీర్షికలు పెట్టాయి. జగన్ కూడా అచ్చంగా మహేశ్‌బాబు తరహాలో జగన్ అను నేను… అంటూ సినీ ఫక్కీలో ప్రమాణం చేయడాన్ని అందరూ గమనించారు. వోవరాల్‌గా మహేశ్‌బాబు ఇటు చంద్రబాబు ఓటమిలో ఎంతో కొంత పార్ట్ తీసుకోవడం, ఇప్పుడు టీఆర్ఎస్ నేతకు ఓపెన్‌గానే మద్ధతు ఇస్తుండటం.. ఇవన్నీ గమనిస్తే.. తండ్రి కృష్ణ తరహాలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూడా యన్టీఆర్ పెట్టిన పార్టీకి వ్యతిరేకంగానే వున్నట్టు కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp