సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లా నుంచి వచ్చిన డేరింగ్ అండ్ డేషింగ్ హీరో. మరి గుంటూరు మిర్చీ కారం ఘాటు ఎలాంటిదో తెలుగు రాష్ట్రాలకు తెలుసు.అదే టెంపర్ తో అతి తక్కువ టైమ్ లో హీరోఅయ్యి సూపర్ ఫాస్ట్ ఎక్సెప్రెస్ గా దూసుకుపోయారు కృష్ణ.
హై ఓల్టేజ్ మాస్ హీరోగా రికార్డ్ స్థాయిలో అభిమాన సంఘాలు ఏర్పరుచుకున్న నటుడు కూడా ఆయనే.అలాంటి నటశేఖరుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మరో గుంటూరు హీరో మహేష్ బాబు. తండ్రికి ఏ మాత్రం తగ్గకుండా స్టార్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తున్న వైట్ కాలర్ హీరో మహేష్.
అయితే మహేష్ బాబు కి సరైన మాస్ సినిమా పడాలని ఫ్యాన్స్ కొంత కాలంగా వెయిటింగ్. ఒక బిజినెస్ మాన్ సూర్య భాయ్ ని, ఒక ఒక్కడు అజయ్ ని, ఖలేజా సీతా రామరాజుని, అతడు నందుని కోసం వెయిట్ చూస్తూ ఉన్నారు.
ఆ లోటు తీర్చడానికి, ఘట్టమనేని అభిమానుల ఆశలకు విందుభోజనం లాంటి సక్సెస్ ఇవ్వాలని మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసాడు. ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలకి కల్ట్ స్టేటస్ ఉంది.
ఈసారి మాత్రం మూడో సినిమాకి ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మహేష్ అండ్ త్రివిక్రమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ పై SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీకి టైటిల్ ని అనౌన్స్ చెయ్యడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు.
మే 31న కృష్ణ జయంతి సందర్భంగా SSMB 28 టైటిల్ ని ‘గుంటూరు కారం’గా అనౌన్స్ చెయ్యనున్నారు. ఈ అనౌన్స్ మెంట్ కి సంబంధించిన అప్డేట్ ఈరోజు బయటకి రానుంది.
చాలా రోజులుగా ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ‘SSMB 28’ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక అప్డేట్ కూడా బయటకి వచ్చేస్తుంది కాబట్టి మహేష్ ఫాన్స్ మరింత అలర్ట్ గా ఉంటే ఇప్పటివరకూ ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు.
ఈ సినిమాకి టైటిల్ దాదాపుగా ‘గుంటూరు కారం’గానే ఫిక్స్ అయినట్లు సమాచారం. టైటిల్ ఏదైనా మాస్ మాత్రం మిస్ అవ్వకుండా మహేష్-త్రివిక్రమ్ ఒక సాలిడ్ సినిమా ఇచ్చేస్తే ఆ తర్వాత పని ఫాన్స్ చూసుకుంటారు.