విలక్షణ నటుడు, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కోర్టులో చుక్కెదురైయ్యింది. తన మీద నమోదు అయిన అక్రమ ఏనుగు దంతాల కేసు విచారణ నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు మోహన్ లాల్. దీంతో కేసు విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. కేసు విచారణకు మోహన్ లాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
కొంతకాలం క్రితం ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ దాడుల్లో రెండు ఏనుగు దంతాలు గుర్తించారు అధికారులు. అయితే.. ఆ సమయంలో లాల్ మీద ఎలాంటి కేసు నమోదు చేయలేదు అధికారులు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడన్నట్టు.. ఐటీ శాఖ అధికారులు వదిలేసినా.. కేరళ అటవి శాఖ అధికారులు మాత్రం వదిలిపెట్టలేదు. అక్రమంగా ఏనుగు దంతాలు పెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించారని లాల్ మీద కేసు నమోదు చేశారు అధికారులు.
ఇదే సమయంలో ఇద్దరు సామాజిక కార్యకర్తులు జేమ్స్ మ్యాథ్యూ, ఏఏ పౌలోస్ కలిసి ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్న మోహన్ లాల్ మీద చర్యలు తీసుకోవాలని కోర్టులో పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన మోహన్ లాల్.. తన మీద నమోదు అయిన అక్రమ ఏనుగు దంతాల కేసు విచారణను నిలిపివేయాలని కోర్టును కోరారు. అయితే.. థర్డ్ పార్టీ జోక్యం తగదని గతంలో ట్రయల్ కోర్టు ఈ కేసు విచారణను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో పిటీషనర్ల వాదనను వినడానికి కోర్టు అనుమతించింది.
కేరళ హైకోర్టు ఆదేశాలతో మోహన్ లాల్ కు మళ్లీ ఏనుగు దంతాల కేసు టెన్షన్ మొదలైయ్యింది. ఎవరైనా అక్రమంగా ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్నారని కోర్టు విచారణలో వెల్లడైతే.. మూడు నుంచి ఏడు ఏళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ కేసులో మోహన్ లాల్ కు కోర్టు ఎలాంటి కేసు విధిస్తుందనేది వేచి చూడాలంటున్నారు నిపుణులు.