సస్పెన్స్ వీడింది. రాజకీయ పార్టీ స్థాపనపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని, జనవరిలో పార్టీ లాంచింగ్ ఉంటుందని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు.
రజినీకాంత్ పార్టీ పెట్టే విషయమై మూడేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. 2017 డిసెంబరులో ‘అరసియల్‌కు వరువదు ఉరుది’..రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ బహిరంగ ప్రకటన చేశారు రజనీకాంత్. అభిమాన సంఘాలను మక్కల్ మన్రాలుగా మార్చారు. ఇన్‌చార్జ్‌లను నియమించారు. సభ్యత్వ నమోదు చేపట్టారు. కానీ పార్టీ పేరు ప్రకటన విషయం మాత్రం ముందుకు కదలలేదు. ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో పార్టీని ప్రారంభించిన తరువాత అధ్యక్షుడిగా మాత్రమే వ్యవహరిస్తాను.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరో వ్యక్తి ఉంటారంటూ మీడియా వేదికగా మరో ప్రకటన చేశారు. కనీసం అప్పుడైనా ప్రకటన వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు.
ఇటీవలే మక్కల్ మన్రా సభ్యులతో సమావేశమైన ఆయన త్వరలో రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇంత త్వరగా ఈ నిర్ణయం ఉంటుందని ఎవరూ భావించలేదు.