అతని పేరు బుస్సా కృష్ణ…అలియాస్ ట్రంప్ కృష్ణ…ఊరు తెలంగాణ లోని జనగాం జిల్లా కేంద్రం…అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటే అతని చచ్చేంత అభిమానం…ఆయన కోసం జనగాంలోని తన ఇంటి పక్కనే 6 ఫీట్ల విగ్రహాన్ని నిర్మించాడు. ఈ నెల 24 నుంచి రెండు రోజుల పర్యటనకు భారత్ కు వచ్చే డోనాల్డ్ ట్రంప్ ను తాను నిర్మించిన విగ్రహావిష్కరణకు తీసుకొచ్చి తన కోరిక నెరవేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నాడు.
”ఇండో-అమెరికా సంబంధాలు బలోపేతం కావాలని కోరుకుంటున్నాను…ప్రతి శుక్రవారం ట్రంప్ కోసం ఉపవాసం ఉంటాను…ఇది జీవితాంతం కొనసాగుతుంది…నాతో పాటు ఎప్పుడూ ట్రంప్ ఫోటో వెంట బెట్టుకొని వెళ్తాను…ఏ పనైనా మొదలు పెట్టే ముందు ఆ ఫోటోకు మొక్కి మొదలుపెడతాను…నేను ట్రంప్ ను కలవాలనుకుంటున్నాను…నా కలను నిజం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను” అన్నారు బుస్సా కృష్ణ.
బుస్సా ఇంకెవరి అభిమాని కాదు…తాను ట్రంప్ భక్తుడినని చెప్పుకుంటాడు. తన ఇంటి ముందు నిర్మించిన ట్రంప్ విగ్రహానికి రోజు పూజలు నిర్వహిస్తాడు..నాకు ఆయన దేవుని లాంటి వాడు…అందుకే విగ్రహం కట్టించానని చెప్పాడు కృష్ణ. విగ్రహ నిర్మాణానికి 15 మంది కూలీలు, దాదాపు నెల రోజులు నిర్మించారని తెలిపారు.
Advertisements
ట్రంప్ పట్ల కృష్ణకున్న భక్తికి గ్రామస్థులందరు ఆయన్ను ట్రంప్ కృష్ణగా పిలవడం మొదలుపెట్టారు. కృష్ణ ఇంటిని ట్రంప్ ఇల్లుగా పిలుస్తారు. గ్రామస్థులెవరూ అతని భక్తికి అభ్యంతరం చెప్పలేదని కృష్ణ స్నేహితుడు, గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి తెలిపారు. ట్రంప్ ను కలవాలనే కృష్ణ కోరికను నెరవేర్చాల్సిందిగా గ్రామ పెద్ద కన్నయ్య ప్రభుత్వాన్ని కోరాడు.