గుజరాత్ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు.. ప్రజల ఆశీస్సులతోనే తిరిగి గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగామని ఆయన చెప్పారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.
గుజరాత్ లో పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, పార్టీ కార్యకర్తల శ్రమకు తగిన ఫలితం లభించిందని ఆయన అన్నారు. గుజరాత్ ప్రజలు అన్ని రికార్డులను తిరగరాశారు.. బీజేపీకి మద్దతునిచ్చి సరికొత్త చరిత్రను ఆవిష్కరింపజేశారు.. కుటుంబ రాజకీయాలు, అవినీతిపై ప్రజావ్యతిరేకత పెరుగుతోంది. ఇందుకు ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు. యూపీలోని రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారని, ఇక దేశంలో మెల్లగా ఈ పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆయన చెప్పారు.
బీహార్ లో తమ పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని ఆయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో కేవలం ఒక్క శాతం కన్నా గెలుపు ఓటములు జరిగాయని, అయినా అక్కడ ప్రజలు బీజేపీని ఆదరించారని మోడీ పేర్కొన్నారు. మహిళలకు మరే ఇతర పార్టీ కూడా తమ పార్టీని మించి ప్రయోజనాలు కల్పించలేదని, ఈ కారణంగానే పెద్ద సంఖ్యలో వారు తమ పార్టీని గెలిపించారని ఆయన చెప్పారు.
భూపేంద్ర పటేల్.. నరేంద్ర మోడీ రికార్డులను బ్రేక్ చేశారని, అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచారని మోడీ అన్నారు., దేశం ఎప్పుడు సవాళ్ళను ఎదుర్కొన్నా.. ప్రజలు తమ విశ్వాసాన్ని బీజేపీపై చూపుతూ వస్తున్నారన్నారు. ఒక్క రీపోలింగ్ కూడా జరగకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు ఈసీకి కృతజ్ఞతలు చెబుతున్నానని మోడీ పేర్కొన్నారు.