ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది. ఎన్నికల వేళ హద్దులు దాటుతున్న ఉచిత హామీలపై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాధనాన్ని వృధా చూస్తూ పథకాలను అమలు చేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఓటర్లను ప్రసన్నం చేయడానికి.. గెలుపే లక్ష్యంగా ఉచిత పథకాలను ప్రకటిస్తూ.. రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తున్నారని పిటిషనర్ అశ్వినీ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదారుల్లో ఓటర్లను మభ్యపెట్టి లబ్ధి పొందాలని పలు పార్టీలు భావిస్తున్నాయని వివరించారు.
ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించేలా పథకాల తీరు ఉంటున్నాయని తెలిపారు. ఇలాంటి పార్టీలను నిషేధించాలని కోరారు. ఇటువంటి ప్రయత్నాలు ఎన్నికల పవిత్రతను దెబ్బతీస్తాయని అన్నారు. పోటీ చేసే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆదర్శానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ ని ఈ విషయంలో అలెర్ట్ చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. 4 వారాల్లోగా దీనికి వివరణ ఇవ్వాలని ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది.