2002 లో గుజరాత్ అల్లర్ల సందర్భంగా సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు బిల్కిస్ బానో కేసును విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో 11 మంది నిందితులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాబిక్ష ప్రసాదించి జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు కొత్త బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ. జస్టిస్ జేబీ.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
తమ క్లయింట్ అభ్యర్థనపై వెంటనే విచారణ జరపాలని, నూతన బెంచ్ ఏర్పాటు చేయాలని బిల్కిస్ బానో తరఫు లాయర్ శోభా గుప్తా కోరారు.దీనిపై స్పందించిన సీజేఐ.. సాయంత్రం లోగా ఇందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత జనవరి 24 న కూడా బిల్కిస్.. కోర్టులో పిటిషన్ వేశారు. 2002 లో గుజరాత్ లో జరిగిన ఘర్షణల్లో ఈమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు.
ఈ కేసులో 11 మంది నిందితులను వారి శిక్షాకాలం ముగియడానికి ముందే విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా అనేక మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం హేశాయి. 1992 జులై 9 నాటి రెమిషన్ పాలసీ ప్రకారం వీరిని రిలీజ్ చేస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
గత ఏడాది ఆగస్టు 15 న ఈ దోషులంతా విడుదలయ్యారు. అయితే వీరి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, వీరి క్షమాభిక్ష ఉత్తర్వులను రద్దు చేసి వీరిని తిరిగి జైలుకు పంపాలని బిల్కిస్ బానో తన పిటిషన్ లో కోరారు. కానీ ఏ కారణం వల్లో ఆమె దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను గత ఏడాది డిసెంబరులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022 మే 13 నాటి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె ఈ రివ్యూ పిటిషన్ వేశారు.