దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనలపై మండిపడింది. దీనిపై గతంలో విధించిన రూ.2.50 లక్షల జరిమానా చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పాటించకపోవడంపై సుప్రీం సీరియస్ అయింది. దీంతో ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. పిటిషన్ పెండింగ్ లో ఉందని.. అందుకే జరిమానా చెల్లించలేదని తెలిపారు. ఈ క్రమంలో జరిమానా చెల్లించేందుకు ప్రభుత్వానికి మరో 2 వారాలు గడువు ఇచ్చింది ధర్మాసనం.
ఈసారి తప్పకుండా జరిమానా చెల్లించాలని.. లేకపోతే.. కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని హెచ్చరించింది. అన్నిచోట్ల రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడి ఉండాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.
అసలేం జరిగింది? వివాదం ఏంటి?
ఉమ్మడి రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులన్నీ ఎస్టీలకే కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియామకాలు కూడా చేపట్టింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అప్పటికి రెండు రాష్ట్రాలు కావడంతో ఏపీ, తెలంగాణకు రెండున్నర లక్షల చొప్పున జరిమానా విధించింది. అయితే.. ఏపీ ప్రభుత్వం సదరు నగదును చెల్లించగా.. కేసీఆర్ సర్కార్ మాత్రం ఇవ్వలేదు. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. రెండు వారాల గడువు ఇచ్చింది.