సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం సమాచార హక్కు చట్టం కిందకే వస్తుందని సుప్రీంకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. 2010 లో ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. సమాచార హక్కు చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ కార్యాలయం పబ్లిక్ ఆథార్టీ కాబట్టి ప్రజలు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పారదర్శకత, జవాబుదారీతనం రెండూ కలిసి ఉండాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా తన ప్రధాన తీర్పులో పేర్కొన్నారు. పారదర్శకత మాత్రమే న్యాయవ్యవస్థ స్వతంత్రతను బలోపేతం చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దారుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత ఆస్తుల వివరాలు అడిగితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవ్వకుండా ఉండొద్దని తీర్పులో పేర్కొంది. అయితే సమాచారాన్ని దుర్వినియోగం చేస్తారని భావిస్తే మాత్రం ఇవ్వకుండా ఉండొచ్చని మినహాయింపు నిచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా తీర్పును ధర్మాసనంలోని ఇతర సభ్యులైన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా బలపర్చారు.
2007 నవంబర్ లో సుభాష్ చంద్ర అగర్వాల్ అనే ఆర్.టి.ఐ కార్యకర్త సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తులు తెలియజేయాలంటూ ఆర్.టి.ఐ. యాక్ట్ కింద దరఖాస్తు చేశారు. సుప్రీంకోర్టు ఆ సమాచారం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సుభాష్ చంద్ర అగర్వాల్ కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తున్నందున దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషన్ సుప్రీంకోర్టును కోరింది. దీంతో 2009 లో కేంద్ర సమాచార కమిషన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫీస్ పబ్లిక్ ఆథార్టీ అయినందున సమాచార హక్కు చట్టం కిందకు వస్తుందని తీర్పు నిచ్చింది.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 2010 లో సుప్రీం కోర్టు సెక్రెటరీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసం ఢిల్లీ తీర్పును సమర్థిస్తూ… చారిత్రాత్మక తీర్పునిచ్చింది.