తన మొబైల్ యాప్ లో సుప్రీంకోర్టు యాండ్రాయిడ్ వెర్షన్ 2.0 ని బుధవారం లాంచ్ చేసింది. దీనివల్ల వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన లా ఆఫీసర్లు, నోడల్ అధికారులు కూడా కోర్టు విచారణలను ఇందులో చూడవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్.. ఈ మొబైల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని, ఐ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం వెర్షన్ వారం రోజుల్లోగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
లాయర్లు, అడ్వొకేట్లకే కాకుండా ఈ అధికారులు సైతం ఇందులో లాగిన్ కావడం ద్వారా .. కోర్టు ప్రొసీడింగ్స్.ని వాచ్ చేయవచ్చునని ఆయన చెప్పారు. తమకు సంబంధించి దాఖలైన కేసుల స్టేటస్ ని, ఉత్తర్వులు, తీర్పులు, పెండింగులో ఉన్న కేసుల తాలూకు వివరాలను వారు తెలుసుకోవచ్చునని అన్నారు.
ఈ మొబైల్ యాప్ ఇదివరకే లాయర్లకు, అడ్వొకేట్లకు అందుబాటులో ఉంటూ వచ్చింది. ముఖ్యంగా దేశంలో కోవిడ్ కేసులున్నప్పుడు వారికిది ఎంతో ఉపయోగపడింది.
నాడు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ .. వర్చ్యువల్ గా కోర్టు ఉత్తర్వులు, తీర్పులను చూసేందుకు కొందరు మీడియా జర్నలిస్టులకు కూడా ఈ సౌకర్యం కల్పించారు. సుప్రీంకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ ని ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్ చేసే విధానానికి శ్రీకారం చుట్టిన న్యాయమూర్తులు తాజాగా ఈ యాండ్రాయిడ్ వెర్షన్ 2,0 ని లాంచ్ చేయడం విశేషం.