జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను నిర్బంధం నుంచి విడుదల చేస్తున్నారా..? లేదా..? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, జమ్మూ కశ్మీర్ పాలకులను ప్రశ్నించింది. వచ్చే వారం ఏ విషయమైంది తెలియజేయాలని కోరింది. జమ్మూ కశ్మీర్ లో గత ఏడాది ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఒమర్ అబ్దుల్లాను ప్రభుత్వం నిర్బంధించింది.
ఒమర్ అబ్దుల్లాను నిర్బంధించడంపై ఆయన సోదరి సరా అబ్దుల్లా పైలట్ వేసిన పిటిషన్ ను జడ్జిలు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎం.ఆర్ షాల ధర్మాసనం విచారిస్తూ ఒమర్ అబ్దుల్లాను వెంటనే విడుదల చేయకపోతే వచ్చే వారం అతని సహజ హక్కులపై విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ కేసును వాదించాల్సిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వేరే కోర్టులో వేరే కేసు విచారణలో ఉన్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కేసు విచారణకు త్వరలోనే మరో తేదీని నిర్ణయించాలని పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టును కోరారు. కేవలం ఆరు బెంచ్ లు మాత్రమే పని చేస్తున్నందున ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. భవిష్య వచ్చే వారం మేము కూర్చుంటాం…ఆ రోజు చూస్తామన్నారు.