సుప్రీం కోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ రోజు ప్రమాణం చేయించారు. దీంతో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుకుంది.
2019 తర్వాత, తొలిసారిగా భారత సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో న్యాయమూర్తులను కేంద్రం నియమించింది. జస్టిస్ బిందాల్ అంతకు ముందు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 11 అక్టోబర్ 2021 నుంచి జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
జస్టిస్ అరవింద్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 13 అక్టోబర్ 2021 నుంచి ఆయన గుజరాత్ హైకోర్టు సీజేగా ఆయన పని చేశారు. వారిద్దరికీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీం కోర్టు కొలీజియం జనవరి 31న ప్రతిపాదించింది.
అంతకు ముందు ఈ నెల 6న సుప్రీం కోర్టులో ఐదుగురు న్యాయమూర్తులతో సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అషనుద్దీన్ అమానుల్లా , జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు.