రాజకీయాలు నేరమయం కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న సుప్రీంకోర్టు…ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు నేర చరిత్ర ఉంటే ఆ వివరాలను బయటపెట్టాల్సిందిగా పార్టీలను ఆదేశించింది. నేర చరిత్ర ఉన్న అభ్యర్ధులు వివరాలను తమ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని పేర్కొంది. నేర చరిత్ర ఉన్నప్పటికీ వారికి టిక్కెట్లు ఎందుకు ఇచ్చారో వివరించాలని పార్టీలకు సూచించింది.
ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్ధులు తమ నేర చరిత్రను ప్రకటించాలంటూ 2018 సెప్టెంబర్ 25న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. అభ్యర్ధుల నేర చరిత్రకు సంబంధించిన అన్నివిషయాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయాలని పేర్కొంది. అయితే ఈ తీర్పును అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని ఆరోపిస్తూ సీనియర్ లాయర్ అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీంకోర్టు తాజా ఆదేశా లిచ్చింది. గత నాలుగు జనరల్ ఎలక్షన్స్ లో రాజకీయాల్లో క్రిమినల్స్ సంఖ్య పెరిగిపోయిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై క్రిమినల్ కేసులుంటే ఆ వివరాలను వెబ్ సైట్లలో పొందు పర్చాలని సూచించింది. అభ్యర్ధుల నేర చరిత్రలను సోషల్ మీడియాలో కూడా ప్రకటించాలని ఆదేశంచింది. నేర చరిత్ర గల అభ్యర్ధులపై 72 గంటల్లోగా ఈసీకి నివేదిక సమర్పించాలని రాజకీయ పార్టీలకు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించింది. పిటిషనర్ ఎలక్షన్ కమిషన్ పై కూడా ఆరోపణలు చేశారు. నేర చరిత్ర కలిగిన వారి గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కల్పించాల్సిన ఈసీ పెద్దగా ప్రజలకు తెలియని చిన్న చిన్న పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు.