భావ ప్రకటనా స్వేచ్ఛలో ఇంటర్నెట్ కూడా భాగమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ కలిగి ఉండడం కూడా భావప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు జడ్డీ జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్ లో ఇంటర్నెట్ తొలగించడంపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పు నిచ్చింది. ”ప్రజల భద్రత, స్వేచ్ఛ సమతుల్యంగా ఉన్నాయా లేదా అనేది చూడడమే మాకున్న పరిధి…ప్రజలు వారి హక్కులు కాపాడడమే మా పని…ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో రాజకీయ ఉద్దేశాల జోలికి వెళ్లం అని రమణ తీర్పులో పేర్కొన్నారు.
144 సెక్షన్ ను మాటి మాటికి ప్రయోగించడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్ లో 144 సెక్షన్ ను విధించడం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమే నంది. ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్త పర్చే హక్కుంటుందని దాన్ని సెక్షన్ 144 ప్రయోగించి అడ్డుకోవడం సరైంది కాదంది. ఏదైనా హింసకు పాల్పడుతున్నట్టు…ప్రజా భద్రతకు భంగం కలిగించనున్నట్టు సరైన ఆధారాలుంటే 144 సెక్షన్ విధించాలే తప్ప మిగతా సందర్భాల్లో కాదని గుర్తు చేసింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న సెక్షన్ 144 ను పున:పరిశీలించాలని ఆదేశించింది.