జమ్ము కశ్మీర్ అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తు దాఖలైన పిటిషన్ రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందని న్యాయస్థానం పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లుబాటుపై ఇప్పటి వరకు తాము తీర్పు ఇవ్వలేదని న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో జమ్ము కశ్మీర్ నియోజక వర్గాల పునర్విభజనపై దాఖలైన ప్రత్యేక పిటిషన్ పై నిర్ణయం ఎలాంటి ప్రభావమూ చూపబోదని న్యాయస్థానం తెలిపింది.
జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో డీలిమిటేషన్ ను సవాల్ చేస్తూ శ్రీనగర్‌కు చెందిన హాజీ అబ్దుల్ ఘనీ ఖాన్, డాక్టర్ మహ్మద్ అయూబ్ మట్టూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.
అసెంబ్లీ స్థానాలు పెంచడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82, 170,330లకు విరుద్ధమని పిటిషన్ లో వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా తో కూడిన ధర్మాసనం విన్నది. అనంతరం తీర్పును డిసెంబర్ 1న రిజర్వ్ చేసింది.