ఆటో ఇండస్ట్రీకి సుప్రీంకోర్టు తీర్పు కొంత ఉపశమనం కలిగించింది. బీఎస్-4 వాహనాలను అమ్ముకోవడానికి గడువును 10 రోజులు పొడిగించింది. వచ్చే నెల 14 న లాక్ డౌన్ ముగిసిన తర్వాత 10 రోజుల వరకు అమ్ముకోవచ్చని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వాహనాలు అమ్ముకోలేకపోయినందున గడువు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోబైల్ డీలర్స్ అసోషియేషన్ వేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ తీర్పు నిచ్చింది. కేవలం 10 శాతం మాత్రమే బీఎస్-4 వాహనాలు మిగిలి ఉన్నాయని…లాక్ డౌన్ ముగిసిన తర్వాత 10 రోజుల్లో వాటిని అమ్ముకోవాలని సూచించింది. అంతేగాక వాహనాలను ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ కూడా అమ్ముకోవచ్చని…అమ్మకాలు పూర్తయిన 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోర్టు తెలిపింది. ఏప్రిల్ 14 న లాక్ డౌన్ ముగుస్తుండడంతో ఏప్రిల్ 24 వరకు డీలర్లు తమ వాహనాలను అమ్ముకోవచ్చు.
15 వేల ప్యాసింజర్ కార్లు, 12 వేల కమర్షియల్ వెహికిల్స్, 7 లక్షల టూ వీలర్స్ మిగిలి ఉన్నాయని…మొదట ఆటోమోబైల్ ఇండస్ట్రీ మందగమనం.. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో అమ్మకాలు పడిపోయాయని అసోషియేషన్ వాదించింది. బీఎస్ -4 వాహనాల కాలుష్యంతో పర్యావరణంపై ఇక ఏ మాత్రం ప్రభావం పడనీయమని కోర్టు పేర్కొంది. ” కొంత త్యాగ గుణాన్ని నేర్చుకుందాం…దేశ పర్యావరణం కోసం ఏదైనా చేయండి…సానుభూతి కలిగి ఉండండి…వాణిజ్యవేత్తలు, డీలర్ల మానసిక స్థితిని మేము అర్ధం చేసుకోగలం…కరోనాతో లాక్ డౌన్ ప్రకటించడాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటున్నారు” అని జడ్జి వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ వల్ల ఆటో మోబైల్ ఇండస్ట్రీకి దాదాపు రూ.13000-15000 కోట్ల నష్టం వాటిల్లవచ్చని అంచనా. ప్రస్తుతం టూ వీలర్ ఇండస్ట్రీ ఒక్కటే బీఎస్-4 వాహనాలతో రూ.4,600 కోట్లు నష్ట పోతుంది. దాదాపు 8 లక్షల టూ వీలర్లు డీలర్ల దగ్గర మిగిలి ఉన్నాయి. అంతేగాక ఉత్పత్తి ఆగిపోవడంతో ఆటోమోబైల్స్ మ్యాన్యుఫ్యాక్ఛరర్స్ కు ఇప్పటికే రోజుకు రూ.2300 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.