బీమా కోరేగావ్ కేసులో విరసం నేత వరవర రావుకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆయన బెయిల్ ను పొడగిస్తు సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీం కోర్టు పేర్కొంది.
అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈ కేసులో తనకు శాశ్వత బెయిల్ మంజూరు చేయాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ ను గతంలో బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏప్రిల్ 13న ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 19కు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్. ఎస్. రవీంద్ర భట్, సుదాన్ష్ దూలియాలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది.
ఎన్ఐఏ తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కేసును బుధవారం లేదా గురువారానికి వాయిదా వేయాలని కోరారు. వరవరరావు తాత్కాలిక బెయిల్ గడువు నేటితో ముగియాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల న్యాయవాదుల కోరిక మేరకు కేసును వాయిదా వేస్తూ వరవర రావుకు బెయిల్ ను పొడిగిస్తున్నట్టు తెలిపింది.