సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యులు ‘‘షేమ్… షేమ్‘‘ అని నినాదాలు చేస్తుండగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యింది. రంజన్ గొగోయ్ ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడం న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై దాడి అని కాంగ్రెస్ విమర్శించింది. నాలుగు నెలల క్రితం రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ప్రమాణ స్వీకారనంతరం గొగోయ్ మాట్లాడుతూ…‘‘ జాతి నిర్మాణం కోసం న్యాయ వ్యవస్థ, చట్ట సభలు ఏదో ఒక చోట కలిసి పని చేయాలనేది నా ద్రుఢమైన అభిప్రాయం….అందుకే తాను ఈ పదవిని అంగీకరించాను..న్యాయ వ్యవస్థ అభిప్రాయాలను చట్టసభల్లో వ్యక్తీకరించడానికి తనకు దక్కిన ఈ అవకాశం ఉపయోగపడుతుంది‘‘ అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ అయోధ్య వివాదస్పదం స్థలంతో పాటు పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. వివాదస్పద స్థలం రామాలయానికే చెందుతుందని చెప్పారు. ముస్లింలకు మసీదు కోసం అయోధ్యలోనే వేరే చోట 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
జస్టిస్ గొగోయ్ నియామకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గొగోయ్ నియామకం రాజ్యాంగ మౌళిక నిర్మాణంపై జరిగిన దాడిగా పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని తీవ్రమైన, క్షమించరాని దాడిగా విమర్శించింది.
తన మాజీ సహచరుడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ విమర్శించారు. అతని నిర్ణయం న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై సామాన్యులకు చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని అన్నారు.
దేశానికి మా రుణాన్ని తీర్చుకున్నాం అని జనవరి 12,2018 లో మా ముగ్గురు జడ్జిలతో కలిసి చెప్పిన రంజన్ గొగోయ్, న్యాయ వ్యవస్థ స్వతంత్రను కాపాడడానికి చాలా ధైర్యంతో వ్యవహరించిన గొగోయ్..ఏ విధంగా రాజ్యసభ సభ్యత్వాన్ని ఎలా అంగీకరించాడని ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశాడు కురియన్.
నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీరను వ్యతిరేకిస్తూ…ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని…న్యాయ వ్యవస్థ స్వతంత్రకు ముప్పు వాటిల్లుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా జనవరి 12, 2018 లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన నలుగురు సుప్రీంకోర్టు జడ్జిల్లో జస్టిస్ కురియన్ జోసెఫ్ తో పాటు రంజన్ గొగోయ్ కూడా ఉన్నారు.