సుప్రీం కోర్టులో నూతనంగా ఐదుగురు న్యాయమూర్తులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు.
దీంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం గతేడాది డిసెంబర్ 13న సిఫారసు చేసింది. కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలిపిన కేంద్రం ఈ మేరకు ఈ నెల 4న ప్రకటన చేసింది.
సుప్రీంకోర్టు, దేశంలోని 25 హైకోర్టులకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై ప్రభుత్వం, కేంద్రం మధ్య ఇటీవల వివాదం ఏర్పడింది. అత్యున్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, ప్రభుత్వం తమ విభేదాలను బహిరంగంగా వ్యక్తం చేశాయి.
రిజిజు ఇటీవలే కొలీజియం భారత రాజ్యాంగానికి “పరాయి” అని అభివర్ణించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ 2015లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం, సంబంధిత రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని ప్రశ్నించారు.