– 28 వరకు మధ్యంతర బెయిల్
– ద్వారకా కోర్టుకు సుప్రీం ఆదేశాలు
– ఉదయం ఖేరాను అసోం పోలీసులు అరెస్టు
– హస్తం పార్టీ నేతల ఆందోళనలు
– సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పార్టీ
ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో ఉపశమనం లభించింది. ఆయన అరెస్టును సవాల్ చేస్తు కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టుకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
పవన్ ఖేరా నోరు జారారు:
పవన్ ఖేరా తరఫున ఏఎం సింఘ్వీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ప్రధానిపై విమర్శలు చేస్తున్న సందర్భంలో ఆయన అలాంటి వ్యక్తిగత విమర్శలను ఖేరా చేసి వుండ కూడదని అన్నారు. కానీ ఆయన నోరు జారారని అన్నారు. ఆయన తప్పు చేశారని, దానికి ఆయన దానికి క్షమాపణలు కూడా చెప్పారని సింఘ్వీ సుప్రీం కోర్టుకు ధర్మాసనానికి వివరించారు.
ఖేరాకు మధ్యంతర బెయిల్:
సింఘ్వీ వాదనలు విన్న సుప్రీం కోర్టు ఖేరాకు ఉపశమనం కలిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఖేరా క్షమాపణలు కోరారని సీజేఐ అన్నారు. అనుచిత వ్యాఖ్యల విషయంలో బేషరతుగా క్షమాపణలు చెబుతారని ఆయన తెలిపారు. అనంతరం ఖేరాకు 28వరకు బెయిల్ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీలోని ద్వారకా కోర్టును ఆదేశించింది. ఈ కేసులో తనపై పలు రాష్రాల్లో నమోదైన కేసుల్లో అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని, వాటన్నింటినీ కలిపి ఒకే సారి విచారించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.
పవన్ ఖేరా అరెస్టు
చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఢిల్లీ విమానాశ్రం చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలతో కలిసి ఇండిగో విమానం ఎక్కారు. ఇంతలో అసోం పోలీసులు వచ్చి ఆయన్ని అడ్డుకున్నారు. విమానం దించి ఆయన్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
కాంగ్రెస్ ఆందోళనలు…
పవన్ ఖేరా అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అరెస్టు వారెంట్ లేకుండానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారంటూ ఆరోపణలు చేశాయి. ఈ మేరకు విమానాశ్రయంలోనే నిరసనలకు దిగాయి. అనంతరం ఖేరా అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ప్రజాస్వామ్యాన్ని హిట్లర్ షిప్‌గా మార్చారు.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్టు చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజస్వామ్యాన్ని హిట్లర్ షాహీగా మార్చారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మాట్లాడితే నోటీసులు ఇస్తారన్నారు. చత్తీస్ గఢ్ ప్లీనరీకి ముందు తమ నేతలపై ఈడీ దాడులు చేశారని, ఇప్పుడు బలవంతపు అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
వివాదాస్పదమైన పవన్ ఖేరా వ్యాఖ్యలు….
హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసి విచారణ జరపాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు. జేపీసీ ఏర్పాటులో కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటని అడిగారు. గతంలో ప్రధానులు పీవీ నర్సింహరావు, వాజ్ పాయ్ కూడా జేపీసీ ఏర్పాటు చేశారు.
అలాంటప్పుడు నరేంద్ర గౌతమ్ దాస్‌కు సారీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి ఏంటి సమస్య అన్నారు. పేరు దామోదర్ దాస్ అయినప్పటికీ పని మాత్రం గౌతమ్ దాస్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పవన్ ఖేరాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.