ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు పై దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించేందుకు సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు.
దీంతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల వ్యవహారంపై విచారణ చేపడతామని పేర్కొంది. నవంబర్ 16, 17 తేదీల్లో విచారణ జరుపుతామని జస్టిస్ కిషన్ కౌల్ ధర్మాసనం తెలిపింది.
మరోవైపు, తెలంగాణ, ఏపీలో సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.కాగా, సెప్టెంబర్ నెలలో ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలైంది. విభజన చట్టం నిబంధనలు అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కే పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.ఏపీ, తెలంగాణ, కేంద్రం, ఎన్నికల సంఘంను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్మూకాశ్మీర్ నియోజకవర్గాల పిటిషన్ కు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది సుప్రీంకోర్టు జస్టిస్ జోసఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం.