ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏ ఉద్యోగి కూడా తనకు ఇష్టమున్న లేదా నిర్దిష్ట ప్రాంతానికి తనను బదిలీ చేయాలని యజమానిని బలవంతపెట్టే హక్కులేదని స్పష్టం చేసింది. అవసరాలకు అనుగుణంగా యజమాని తన సిబ్బందిని బదిలీ చేసుకుంటాడని సుప్రీంకోర్టు పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు 2017 అక్టోబర్‌లో ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది హైకోర్టు. అమ్రొహలో నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళా లెక్చరర్ బదిలీ కోరుకునే అవకాశం రావడంతో.. తనను గౌతమ్ బుద్ధనగర్‌కు పంపాలని కోరింది. అయితే గతంలోనే గౌతమ్ బుద్ధనగర్‌లో ఆమె పని చేసి ఉండటంతో.. ఉన్నతాధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. తాజాగా అదే తరహా తీర్పు వచ్చింది.
ఒకవేళ పిటిషనర్ బదిలీ అర్హత సాధించి ఉన్నట్టయితే.. తనను వేరే ప్రదేశానికి బదిలీ చేయమని అభ్యర్థించవచ్చు, కానీ ఇప్పటికే 13 సంవత్సరాలు పనిచేసిన ప్రదేశానికి మళ్లీ తిరిగి పంపాలని కోరలేడు అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.