మోడీ సర్కార్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో పెద్దనోట్ల రద్దు ఒకటి. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. సరైన చర్యలు తీసుకోకుండా సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు పిటిషనర్లు. మొత్తం 58 పిటిషన్లు సుప్రీం ముందుకు వచ్చాయి. తాజాగా ఆ పిటిషన్లపై విచారణ జరిపింది న్యాయస్థానం.
కేంద్రం చేసిన నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని పిటిషన్లు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది న్యాయస్థానం. కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. 2016 డిసెంబర్ 16న అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్.. ఈ వ్యాజ్యాల విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు.
పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణితోపాటు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.చిదంబరం, మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందని సుప్రీం తెలిపింది. కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని వ్యాఖ్యానించింది. నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాన్ని చేరుకుందా లేదా అన్నది సంబంధం లేదని.. పెద్ద నోట్లు రద్దు చేస్తూ 2016 నవంబరు 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం.
అయితే.. ఐదుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆర్బీఐ నుంచి కేవలం అభిప్రాయం మాత్రమే తీసుకున్నారని చెప్పారు. దీన్ని సిఫార్సుగా భావించలేమని.. గెజిట్ నెటిఫికేషన్ ద్వారా నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టాల్సింది కాదన్నారు. నోట్ల రద్దుపై పార్లమెంట్ లో చట్టం చేయాల్సిందని.. దేశం మొత్తానికి ముఖ్యమైన ఇలాంటి నిర్ణయం విషయంలో పార్లమెంట్ ను విస్మరించడం తగదని చెప్పారు. నోట్ల రద్దు అనేది చట్టవిరుద్ధమైన నిర్ణయంగా తెలిపారు నాగరత్న.